జొన్న, మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
- జొన్న, మొక్కజొన్న పంటల కొనుగోళ్లకు నిధులు కేటాయించిన రేవంత్ ప్రభుత్వం
- రైతులను కాపాడాలని సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న తుమ్మల
- పంటల సేకరణకు తక్షణమే ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్‌రెడ్డి సర్కార్ తీపి కబురు అందించింది. రాష్ట్రంలో జొన్న, మొక్కజొన్న పంటల కొనుగోళ్లకు భారీగా నిధులను కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మొక్కజొన్న కొనుగోలుకు రూ.1,800 కోట్లు, జొన్న కొనుగోలుకు రూ.1,100 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. మొక్కజొన్న సేకరించాలని తాము కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని, అందుకే రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ముందుకొచ్చిందని మంత్రి స్పష్టం చేశారు.
భారీ దిగుబడుల నేపథ్యంలో రైతులను కాపాడాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని తుమ్మల పేర్కొన్నారు. మొక్కజొన్న సేకరణకు ఇదివరకే రూ.4,000 కోట్లు విడుదల చేయగా, తాజా కేటాయింపులతో కలిపి ఆ మొత్తం రూ.5,800 కోట్లకు చేరిందన్నారు. జిల్లాల వారీగా ఈ పంటల సేకరణకు తక్షణమే ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనితో పాటు పొద్దుతిరుగుడు రైతులను కూడా ఆదుకుంటామని, 25 శాతానికి మించి ఆ పంటను కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు.